శ్రీనివాస్ మహల్ రాజయ్యగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి నెల్లూరు జిల్లా అల్లిపురం గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన వీరు ఆనాటి నెల్లూరు రాజకీయ దిగ్గజం ఏ.సి. సుబ్బారెడ్డి గారి అనుచరుడిగా ఉంటూనే యువనేతగా జిల్లా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు,
ఏ.సి సుబ్బారెడ్డి మరణాంతరం ఆనం కుటుంబంతో ఏర్పడ్డ రాజకీయ భేదాభిప్రాయాలు కారణంగా వారితో కలిసి మునపటిలాగా రాజకీయంగా నడవకపోయినా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆనం కుటుంబ రాజకీయ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో వారి వ్యతిరేక వర్గాన్ని ఒకే తాటిపై నడిపిస్తూ వచ్చారు.
నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబ రాజకీయ ఒత్తిడిని తట్టుకొని జిల్లా పరిషత్ ఎన్నికల్లో కోట ప్రాంతానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని రెండో సారి నెల్లూరు జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోబెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగింది. అప్పటి కోట సమితి అధ్యక్షుడుగా ఉన్న నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి గారిని నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎదిగేందుకు ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు వీరు అండగా నిలిచారు.శ్రీనివాసులురెడ్డి గారు తర్వాత కాలంలో కేవలం జిల్లా వరకే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు.
1972లో జరిగిన జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొని నెల్లూరు జిల్లాలో ఉద్యమాన్ని విజయవంతం అవ్వడంలో తనవంతు పాత్ర పోషించారు. జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబ ప్రాబల్యం తగ్గించడంలో సఫలీకృతం ఐనప్పటికి తన వర్గంలోని నల్లపురెడ్డి సోదరులు సైతం జిల్లా రాజకీయాలపై పట్టు కోసం ఆనం కుటుంబం అనుసరించిన మార్గంలో వెళ్తున్న సమయంలో వారితో విభేదించి వారికి దూరమయ్యారు. దేశంలో ఎమెర్జెన్సీ విధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని ఇందిరా నియంతృత్వ పోకడలపై విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమెర్జెన్సీ సమయంలో జైలుకు సైతం వెళ్లారు.
1977లో ఎమెర్జెన్సీ ఎత్తివేసిన తరువాత జనతాపార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా జనతా పార్టీ అధ్యక్షునిగా భాద్యతలు స్వీకరించి 1977, 1980లలో జరిగిన లోక్ సభ మరియు 1978 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేసిన పార్టీ పరాజయం చవిచూసింది. జనతా పార్టీలో చీలికలు ఏర్పడిన చంద్రశేఖర్ నేతృత్వంలోని జనతాపార్టీతో కొనసాగారు.
1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి సోదరులతో పాటుగా వీరిని ఆహ్వానించినా వారి ఆహ్వానాన్ని తిరస్కరించి జనతా పార్టీతోనే చివరి వరకు తన రాజకీయ ప్రయాణం చేశారు. 1983 ఏప్రిల్ 5వ తేదీన గుండెపోటుతో మరణించారు.
రాజగోపాల్ రెడ్డి గారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా పలు పర్యాలు భాద్యతలు నిర్వహించారు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగితున్నారు.
రాజగోపాల్ రెడ్డి గారికి శ్రీనివాస్ మహల్ థియేటర్ కు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాల్లో తీరిక లేకున్నా సినిమాలు అంటే ఆసక్తి ఉన్న వీరు నెల్లూరు నగరంలో ఉన్న శ్రీనివాస్ మహల్ సినిమా థియేటర్ ను కొనుగోలు చేశారు. శ్రీనివాస్ మహల్ లో సినిమాలతో పాటు ఆయన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. జిల్లా రాజకీయాల్లో ఆనం వ్యతిరేక వర్గాలుగా ఉన్న బెజవాడ పాపిరెడ్డి, జి.సి.కొండయ్య, నల్లపురెడ్డి సోదరులు మరియు ఇతరులు ప్రతి రోజు సాయంత్రం థియేటర్ లో సమావేశాలు నిర్వహించేవారు.ఒక పక్కా రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న థియేటర్ పర్యవేక్షణ భాద్యతలు సైతం స్వయంగా వీరే చూస్తూ వచ్చారు.థియేటర్ పేరే తన ఇంటిపేరుగా మార్చుకుని శ్రీనివాస్ మహల్ రాజయ్య గా సుప్రసిద్ధులైయ్యారు.
ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రాజగోపాల్ రెడ్డి గారితో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వి.ఆర్ కళాశాలలో విద్యార్ధి నాయకుడిగా ఉన్న నాటి నుంచి శ్రీనివాస్ మహల్ లో జరిగే సమావేశాల్లో వెంకయ్య గారి హాజరు తప్పనిసరిగా ఉండేది. అక్కడి నుంచే మొదలైన వీరి పరిచయం తరువాత కాలంలో జనతాపార్టీలో విరివూరు కలిసి పనిచేస్తున్న సమయంలో గురు శిష్యుల అనుబంధంగా మారింది. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి ఉదయగిరి అసెంబ్లీ టిక్కెట్ కోసం ఏంతో మంది ప్రయత్నాలు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వీరు వెంకయ్య గారికే ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో గెలవడం వెంకయ్య గారి భావి జాతీయ స్థాయి రాజకీయాలకు నాంది పలికింది . తన రాజకీయ ఉన్నతికి దోహదపడిన రాజయ్య గారిని ఇప్పటికి మారువకుండా నెల్లూరు వచ్చిన ప్రతిసారి వారి కుటుంబసభ్యులను కలుస్తూ వస్తున్నారు.
రాజయ్య గారు స్నేహశీలి రాజకీయాల్లో సిద్ధాంతపరంగా విభేదించిన వ్యక్తిగతంగా అన్ని పార్టీల నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలు నెరిపిరారు. ఉదాహరణకు రాజకీయంగా ఆనం కుటుంబంతో విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా మాత్రంగా వారిని ఏంతో గౌరవించేవారు.1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనతా పార్టీలో చేరిన ఆనం వెంకట్ రెడ్డి, సంజీవ రెడ్డి గార్లకు ఏటువంటి బేషజాలకు పోకుండా నెల్లూరు, సర్వేపల్లి అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం.
రాజయ్య గారు దృఢచిత్తుడు, ధైర్యశాలి, నిజాయితీ పరుడు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న తన అభివృద్ధికి కాకుండా ప్రజా సంక్షేమం కోసం నిజాయితీగా కృషి చేస్తూ వచ్చారు. ఏంతో మంది సామాన్య కుటుంబాలకు చెందిన యువతను రాజకీయాల్లో ఎదిగేందుకు చేయూత నిచ్చారు.
రాజకీయ హేమహేమీలకు నిలయమైన నెల్లూరు జిల్లాలో ఎటువంటి ఉన్నతమైన రాజకీయ పదవులు చేపట్టకుండానే జిల్లా రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సరుసటయించుకున్నారు మన రాజయ్య గారు.
No comments:
Post a Comment