Saturday, April 29, 2023

గొట్టిపాటి హనుమంతరావు (1944-1997)

 



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయవేత్తగా పేరు గడించిన మాజీ మంత్రి వర్యులు, స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు గారు స్వాతంత్రానికి పూర్వం అవిభక్త గుంటూరు జిల్లాలోని మార్టూరు తాలూకా యద్దనపూడి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.

హనుమంతరావు గారు ఎస్. ఎస్. ఎల్. సి పూర్తి చేసిన తర్వాత కుటుంబ పరిస్థితులు కారణంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం లేక అక్కడితో చదువుకు స్వస్తిపలికి  రైతుగా జీవితాన్ని ప్రారంభించారు.

రైతుగా ఉంటూనే రైస్ మిల్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి అనేక రంగాల్లోకి వ్యాపార కార్యకలాపాలను విస్తరించి వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచారు.

హనుమంతరావు గారు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లో అడుపెట్టి యద్దనపూడి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అనంతర కాలంలోనే మార్టూరు భూ తనఖా బ్యాంకు ఛైర్మన్ గా, సంతమాగులురు సమితి అధ్యక్షుడుగా పనిచేశారు.

సమితి అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే 1982 లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపునందుకొని ఆ పార్టీలో చేరిన గొట్టిపాటి 1983 ఎన్నికల్లో మార్టూరు నుండి పోటి చేసి తోలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు .అయితే కొద్దీ నెలల్లోనే వచ్చిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.

1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మార్టూరు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. అయితే ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి బలరాం నియంతృత్వ పోకడలతో నియోజకవర్గంలో వీరి అనుచరులను ఇబ్బందులకు గురి చేయడంతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా అధిష్టానంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నాయకులు తమ స్నేహితుడు బలరాంకు వత్తాసు పలకడంతో మనస్తాపం చెందిన వీరు టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్టూరు నుండి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే బలరాం చేతిలో ఓటమి చవిచూసినా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పార్టీ కార్యక్రమాల్లో చూరుగ్గా పాల్గొన్నారు. అయితే కేసుల మాఫీ కోసం తన పూర్వ రాజకీయ గురువు, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సమక్షంలో 1993 లో తన రాజకీయ ప్రత్యర్ధి బలరాం కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు.

బలరాం పార్టీకి చేసిన నమ్మక ద్రోహాన్ని క్షమించని పార్టీ అధినేత ఎన్టీఆర్ హనుమంతరావు గారిని పార్టీలోకి ఆహ్వానించారు. కానీ పార్టీ లోని కొందరు నాయకులు పార్టీలోకి ఆయన్ని రానీయకుండా చేయడంలో విజయం సాధించారు. అయితే ఎన్టీఆర్ గారే స్వయంగా 1994 ఎన్నికల్లో మార్టూరు నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గొట్టిపాటి గారికి పార్టీ తరపున మద్దతు ఇవ్వడంతో ఆయన రెండో సారి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన వెంటనే ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరారు.

1995-97 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.

హనుమంతరావు గారు గొప్ప పరిపాలనా దక్షులు తాను చేపట్టిన ప్రతీ పదవి ద్వారా పూర్తి స్ధాయిలో ప్రజా అభివృద్ధికి కృషి చేశారు. ముఖ్యంగా సంతమాగులూరు సమితి అధ్యక్షుడుగా సమితి పరిధిలోని అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధికి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో కృషి చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఆ శాఖలోని అవినీతిని అరికట్టడంలో విజయం సాధించారు.

హనుమంతరావు గారిది విలక్షణమైన వ్యక్తిత్వం, కేవలం మాట పట్టింపు చేత ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని తృణ ప్రాయంగా త్యజించిన ఆత్మాభిమానం గల మనిషి. చివరి శ్వాస వరకు అవినీతి అక్రమాలకు ఆమడ దూరంగా ఉంటూ నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు.

హనుమంతరావు గారు రైతు పక్షపాతి, స్వతహాగా రైతైన వీరు రైతుల సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో ఉండేవారు. తను చేపట్టిన ప్రతీ పదవి ద్వారా రైతన్నల సంక్షేమం కోసం పాటుపడ్డారు. తూర్పు ప్రకాశం ప్రాంతం ( మార్టూరు (రద్దయిన నియోజకవర్గం), అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు)లో సాగునీటి వనరుల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేసి రైతన్నల అభిమానాన్ని చూరగొన్నారు.

హనుమంతరావు గారు విద్యారంగంలో తనవంతు కృషి చేశారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం లేని కారణంగా తాను చదవకపోయినా తన సోదరుడు శేషగిరి రావును ఎంబీబీఎస్ మరియు మిగిలిన కుటుంబ సభ్యులను ఉన్నత చదువులు చదివించారు. అంతేకాకుండా అనేక మంది నిరుపేద కుటుంబాలను చెందిన విద్యార్ధులకు, తమ వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించారు.

హనుమంతరావు గారి రాజకీయ ఎదుగుదలలో ఆయన తమ్ముడు శేషగిరిరావు గారిది కీలకమైన పాత్ర, తన సోదరుడి కోసం సుదీర్ఘ కాలం తెరవెనుక రాజకీయాల్లో పనిచేస్తూనే కుటుంబానికి చెందిన వ్యాపార వ్యవహారాలను చూసుకునేవారు. హనుమంతరావు గారి కుమారుడు గొట్టిపాటి నరసయ్య సైతం మార్టూరు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. శేషగిరి రావు గారి కుమారుడు ప్రస్తుత అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హనుమంతరావు గారి రాజకీయ వారసుడిగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.

హనుమంతరావు గారు రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నా వ్యక్తిగత జీవితం మాత్రం విషాదభరితం. బలరాంతో ఏర్పడ్డ రాజకీయ వైరం తర్వాత కాలంలో వ్యక్తిగత వైరంగా మారి ఫ్యాక్షన్ గొడవలకు దారి తీసింది. ఈ క్రమంలోనే తన రాజకీయ వారసుడు, చిన్న కుమారుడు గొట్టిపాటి కిశోర్ బాబు హత్య ఆయన్ని మానసికంగా కృంగి పోయేలా చేసింది. కుమారుడితో పాటు తనను నమ్ముకున్న వందల మంది అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రత్యర్థులు యద్దనపూడిలోని తమ రైస్ మిల్లులో అమర్చిన బాంబు పేలడంతో తన కూడి భుజం, తన తమ్ముడైన శేషగిరిరావు గారి మరణం ఆయన్ని మానసికంగా మరింత కృంగి కృశించేలా చేసింది, తన కళ్ల ముందే తనవారు చనిపోవడం భరించలేక కొద్దీ నెలల్లోనే 53 ఏళ్ల వయస్సులో ఆయన కాలం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ చరిత్రలో రాజకీయ గొడవల్లో అత్యంత నష్టపోయిన కుటుంబంగా వీరి కుటుంబం నిలిచింది.

కానీ హనుమంతరావు గారి వర్గానికి చెందిన వారి మరణాలకు కారణమైన ప్రత్యర్ధికి మాత్రం పలు సందర్భాల్లో ఆనాటి రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు అండగా నిలవడం గమనార్హం.

సామాన్య రైతు నుండి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన హనుమంతరావు గారి జీవితాన్ని రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకునే నేటి యువతరం అధ్యయనం చేయడం చాలా అవసరం.

Tuesday, January 4, 2022

బత్తిన నరసింహారావు (1945-2017)

 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో బత్తిన నరసింహారావు గారు ఒకరు. మాజీఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. వ్యాపార,రాజకీయ ,సామాజిక రంగాల్లో తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.

బత్తిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బత్తినవారిపల్లె గ్రామంలో బత్తిన రామయ్య, అక్కమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి రామయ్య గారు ఆరోజుల్లోనే ఆర్.ఎస్.ఎస్ సానుభూతిపరులు. ఆర్.ఎస్.ఎస్ శాఖను తమ ఇంట్లో నిర్వహించేందుకు తోడ్పడ్డారు. 
తండ్రి ద్వారా చిన్న తనంలోనే ఆర్.ఎస్.ఎస్ పట్ల  అభిమానాన్నిపెంచుకున్నారు.

విద్యాభ్యాసం కోసం ఒంగోలు పట్టణంలో నివాసం ఉంటున్న మేనమామ కొండ్ల రామయ్య ఇంటికి చేరి హైస్కూల్ విద్యను ప్రారంభించారు. ఒంగోలులో చదువుతున్న సమయంలోనే ఆర్.ఎస్.ఎస్ శాఖలకు తరచుగా వెళ్లేవారు. ఉన్నత విద్య కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చేరి అగ్రికల్చర్ బీఎస్సి పూర్తి చేశారు. అనంతరం ఒంగోలు కేంద్రంగా  వ్యాపారరంగంలోకి ప్రవేశించారు.

అలహాబాద్ లో చదువుతున్న సమయంలో నే ఆర్.ఎస్.ఎస్ విద్యార్థి సంఘం ఏబీవీపీలో పనిచేశారు. అనంతరం భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి ఒంగోలు ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు విస్తరణలో కీలకంగా వ్యవహరించారు.1972లో జైఆంధ్రా, 1975 లో ఎమెర్జెన్సీ ఉద్యమాల్లో పాల్గొన్నారు.ముఖ్యంగా ఎమెర్జెన్సీ సమయంలో వెంకయ్య నాయుడు గారితో కలిసి పనిచేశారు. 1977 లోక్ సభ ఎన్నికల్లో జనతా పార్టీ టిక్కెట్ మీద ఒంగోలు లోక్ సభకు పోటీ చేసిన
వెంకయ్య గారి ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం ఉదయగిరి నుండి పోటీ చేసిన వెంకయ్య గారి గెలుపునకు కృషిచేశారు.

1980 లో భారతీయ జనతా పార్టీ స్థాపించిన తరవాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  నుండి ఆ పార్టీలో మొదట చేరిన అతి కొద్ది నేతల్లో బత్తిన ఒకరు. ప్రకాశం జిల్లాలో పార్టీ విస్తరణ భాద్యతలతో పాటుగా పార్టీ కార్యక్రమాల కోసం నిధుల సేకరణలో ముందుడేవారు. 1982, 1987లలో వరుసగా రెండు సార్లు ఒంగోలు పురపాలక సంఘానికి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఎల్.కె.అద్వానీ చేపట్టిన రామాజన్మ భూమి రథ యాత్రలో భాగంగా ఒంగోలు లో జరిగిన సభకు జిల్లావ్యాప్తంగా కార్యకర్తలను సమీకరించి సభను విజయవంతం చేయడంతో జాతీయ నేతల దృష్టిలో పడ్డారు.

1991 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఒంగోలు లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ నుండి పోటీ చేసి మరో మారు ఓటమి పాలయ్యారు. ఎన్నికల యుద్ధంలో ఓటమి పాలైన పార్టీలో మాత్రం ఆయన కీలకమైన నేతగా కొనసాగుతూ వచ్చారు. మూడు సార్లు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు గా , పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా
వంటి పలు కీలకమైన పదవులు నిర్వహించారు. అన్ని పార్టీల నాయకులతో సన్నిహితుడిగా చివరి వరకు ఉంటూ వచ్చారు.

నరసింహారావు గారు వ్యాపార రంగంలో విజయవంతమైన వ్యక్తి . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్ , విజయవాడ వంటి నగరాలకే పరిమితం అయినా ఖరీదైన హోటల్ వ్యాపారాన్ని ఒంగోలు వంటి అభివృద్ధి చెందబోతున్న పట్టణంలో 1980ల్లోనే  అత్యాధునిక వసతులతో కూడిన హోటల్ మౌర్యను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోటలియర్స్ రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడిగా పలుమార్లు పనిచేశారు.

రాజకీయాలు, వ్యాపార రంగాలతో పాటుగా ప్రకాశం జిల్లాలో విద్యారంగం అభివృద్ధి కి కూడా కృషి చేశారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్మారకార్థం ఒంగోలు పట్టణంలో 1987లో ఆంధ్ర కేసరి విద్య సంస్థను ప్రారంభించారు. సంస్థ లో తొలుత జూనియర్ ఇంటర్మీడియట్ తో ప్రారంభించి నేడు ఇంటర్మీడియట్, డిగ్రీ, లా మరియు బీఈడీ కళాశాలలు ఉన్నాయి. నేడు  నిరుపేద విద్యార్థులకు ఈ విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది .

బత్తిన నరసింహారావు గారి భార్య పేరు వసుంధర దేవి, వీరి కుమారులు మహేష్ ,రాజేష్ గార్లు డాక్టర్స్ , కుమార్తె దేవసేన గృహిణి. 

సుమారు 50 సంవత్సరాలకు పైగా క్రియాశీలక రాజకీయాల్లో తను నమ్మిన సిద్దాంతలకు కట్టుబడిన వ్యక్తి బత్తిన నరసింహారావు గారు.  



Wednesday, December 15, 2021

సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (1926-1983)



శ్రీనివాస్ మహల్ రాజయ్యగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి నెల్లూరు జిల్లా అల్లిపురం గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించారు. 

కాంగ్రెస్ పార్టీ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన వీరు ఆనాటి నెల్లూరు రాజకీయ దిగ్గజం ఏ.సి. సుబ్బారెడ్డి గారి అనుచరుడిగా ఉంటూనే యువనేతగా జిల్లా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు, 

ఏ.సి సుబ్బారెడ్డి మరణాంతరం ఆనం కుటుంబంతో ఏర్పడ్డ రాజకీయ భేదాభిప్రాయాలు కారణంగా వారితో కలిసి మునపటిలాగా రాజకీయంగా నడవకపోయినా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆనం కుటుంబ రాజకీయ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో వారి వ్యతిరేక వర్గాన్ని ఒకే తాటిపై నడిపిస్తూ వచ్చారు. 

నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబ రాజకీయ ఒత్తిడిని తట్టుకొని జిల్లా పరిషత్ ఎన్నికల్లో కోట ప్రాంతానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని రెండో సారి నెల్లూరు జిల్లా పరిషత్ పీఠంపై  కూర్చోబెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగింది. అప్పటి  కోట సమితి అధ్యక్షుడుగా ఉన్న నల్లపురెడ్డి  శ్రీనివాసులురెడ్డి గారిని నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎదిగేందుకు ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు వీరు అండగా నిలిచారు.శ్రీనివాసులురెడ్డి గారు తర్వాత  కాలంలో కేవలం జిల్లా వరకే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు.

1972లో జరిగిన జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొని నెల్లూరు జిల్లాలో ఉద్యమాన్ని విజయవంతం అవ్వడంలో తనవంతు పాత్ర పోషించారు. జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబ ప్రాబల్యం తగ్గించడంలో సఫలీకృతం ఐనప్పటికి తన వర్గంలోని నల్లపురెడ్డి సోదరులు సైతం జిల్లా రాజకీయాలపై పట్టు కోసం ఆనం కుటుంబం అనుసరించిన మార్గంలో వెళ్తున్న సమయంలో వారితో విభేదించి వారికి దూరమయ్యారు. దేశంలో ఎమెర్జెన్సీ విధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని ఇందిరా నియంతృత్వ పోకడలపై  విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమెర్జెన్సీ సమయంలో జైలుకు సైతం వెళ్లారు. 

1977లో ఎమెర్జెన్సీ ఎత్తివేసిన తరువాత జనతాపార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా జనతా పార్టీ అధ్యక్షునిగా భాద్యతలు స్వీకరించి 1977, 1980లలో జరిగిన లోక్ సభ మరియు 1978 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేసిన పార్టీ పరాజయం చవిచూసింది. జనతా పార్టీలో చీలికలు ఏర్పడిన చంద్రశేఖర్ నేతృత్వంలోని జనతాపార్టీతో కొనసాగారు.

1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి సోదరులతో పాటుగా వీరిని ఆహ్వానించినా వారి ఆహ్వానాన్ని తిరస్కరించి జనతా పార్టీతోనే చివరి వరకు తన రాజకీయ ప్రయాణం చేశారు. 1983 ఏప్రిల్ 5వ తేదీన  గుండెపోటుతో మరణించారు. 

రాజగోపాల్ రెడ్డి గారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా పలు పర్యాలు భాద్యతలు నిర్వహించారు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగితున్నారు.

రాజగోపాల్ రెడ్డి గారికి శ్రీనివాస్ మహల్ థియేటర్ కు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాల్లో తీరిక లేకున్నా సినిమాలు అంటే ఆసక్తి ఉన్న వీరు నెల్లూరు నగరంలో ఉన్న శ్రీనివాస్ మహల్ సినిమా థియేటర్ ను కొనుగోలు చేశారు. శ్రీనివాస్ మహల్ లో సినిమాలతో పాటు ఆయన రాజకీయ  కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. జిల్లా రాజకీయాల్లో ఆనం వ్యతిరేక వర్గాలుగా ఉన్న బెజవాడ పాపిరెడ్డి, జి.సి.కొండయ్య, నల్లపురెడ్డి సోదరులు మరియు ఇతరులు ప్రతి రోజు సాయంత్రం థియేటర్ లో సమావేశాలు నిర్వహించేవారు.ఒక పక్కా రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న  థియేటర్ పర్యవేక్షణ భాద్యతలు సైతం  స్వయంగా వీరే చూస్తూ వచ్చారు.థియేటర్ పేరే తన ఇంటిపేరుగా మార్చుకుని  శ్రీనివాస్ మహల్ రాజయ్య గా సుప్రసిద్ధులైయ్యారు.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రాజగోపాల్ రెడ్డి గారితో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వి.ఆర్ కళాశాలలో విద్యార్ధి నాయకుడిగా ఉన్న నాటి నుంచి శ్రీనివాస్ మహల్ లో జరిగే సమావేశాల్లో వెంకయ్య గారి హాజరు తప్పనిసరిగా ఉండేది. అక్కడి నుంచే మొదలైన వీరి పరిచయం తరువాత కాలంలో జనతాపార్టీలో విరివూరు కలిసి పనిచేస్తున్న సమయంలో గురు శిష్యుల అనుబంధంగా మారింది. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి ఉదయగిరి అసెంబ్లీ టిక్కెట్ కోసం ఏంతో మంది ప్రయత్నాలు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వీరు వెంకయ్య గారికే ఇవ్వడం జరిగింది. ఆ  ఎన్నికల్లో గెలవడం వెంకయ్య గారి భావి జాతీయ స్థాయి రాజకీయాలకు నాంది పలికింది . తన రాజకీయ ఉన్నతికి దోహదపడిన రాజయ్య గారిని ఇప్పటికి మారువకుండా నెల్లూరు వచ్చిన ప్రతిసారి వారి కుటుంబసభ్యులను కలుస్తూ వస్తున్నారు. 

రాజయ్య గారు స్నేహశీలి రాజకీయాల్లో సిద్ధాంతపరంగా విభేదించిన వ్యక్తిగతంగా అన్ని పార్టీల నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలు నెరిపిరారు. ఉదాహరణకు  రాజకీయంగా ఆనం కుటుంబంతో విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా మాత్రంగా వారిని ఏంతో గౌరవించేవారు.1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనతా పార్టీలో చేరిన ఆనం వెంకట్ రెడ్డి, సంజీవ రెడ్డి గార్లకు ఏటువంటి బేషజాలకు పోకుండా నెల్లూరు, సర్వేపల్లి అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. 

రాజయ్య గారు దృఢచిత్తుడు, ధైర్యశాలి, నిజాయితీ పరుడు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న తన అభివృద్ధికి కాకుండా ప్రజా సంక్షేమం కోసం నిజాయితీగా కృషి చేస్తూ వచ్చారు. ఏంతో మంది సామాన్య కుటుంబాలకు చెందిన యువతను రాజకీయాల్లో ఎదిగేందుకు చేయూత నిచ్చారు. 

రాజకీయ హేమహేమీలకు నిలయమైన నెల్లూరు జిల్లాలో  ఎటువంటి ఉన్నతమైన రాజకీయ పదవులు చేపట్టకుండానే జిల్లా రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సరుసటయించుకున్నారు మన రాజయ్య గారు. 




Friday, December 10, 2021

భోగాది దుర్గాప్రసాద్ (1935-1972)

bhogadi durga prasad

భోగాది దుర్గాప్రసాద్ తెలుగు నాట "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" (ఆర్.ఎస్.ఎస్) లో పనిచేసిన పాత తరానికి ఈ పేరు బాగా సూపరిచితం. తూర్పు&పశ్చిమ గోదావరి, కృష్ణ , ఉమ్మడి గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలో ఈ పేరు వినని స్వయం సేవకులు ఉండరు. మరింత క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి గురువు గారు.

భోగాది దుర్గాప్రసాద్ గారు 1935జూన్ 15వ తేదీన కృష్ణా జిల్లాలోని నాగాయలంక తాలూకా పర్రచివర గ్రామంలో ఉన్న సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు భోగాది సుబ్బారావు, మణిక్యమ్మ గార్లు. సోదరులు రామ్మోహన్ రావు , వెంకట సాయి, నారాయణ మూర్తి, సోదరి తులసీ రత్నం. వీరి మేనమామ రాజకీయ ఉద్దండులు, దివిసీమ గాంధీ గా ప్రసిద్ధి గాంచిన మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు గారు. 

దుర్గాప్రసాద్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామమైన పర్రచివర, నాగాయలంక లో , ఇంటర్మీడియట్ మరియు బి.ఏ డిగ్రీ లను బందరు(ప్రస్తుతం మచిలీపట్నం) లోని జాతీయ కళాశాలలో పూర్తి చేశారు. 

దుర్గాప్రసాద్ చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత తో కూడిన దైవ చింతన ఎక్కువగా ఉండేవి, ఈ కారణంగానే చిన్నతనంలోనే ఆర్.ఎస్.ఎస్ తో అనుబంధం ఏర్పడి జీవిత చరమాంకం వరకు కొనసాగింది. కళాశాలలో చదువుతున్న సమయంలోనే ఆర్.ఎస్.ఎస్ లో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయడానికి సంకల్పించిన వీరు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే సంఘ్ ఆదేశాల మేరకు 1955లో నెల్లూరు జిల్లాలో సంఘ్ ప్రచారక్ గా భాద్యతలు స్వీకరించారు. 

అప్పటికే నెల్లూరు జిల్లా ప్రచారక్ గా పనిచేసి రాయలసీమ ప్రాంత ప్రచారక్ గా భాద్యతలు స్వీకరించిన సోమేపల్లి సోమయ్య గారి సహకారంతో నెల్లూరు నగరం మరియు వాటి పరిసర ప్రాంతాలలో వరకే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంఘ్ ను జిల్లా వ్యాప్తంగా విస్తరించి అనేక నూతన శాఖలు ఏర్పర్చడంలో దుర్గాప్రసాద్ గారి కృషి మారువలేనిది. సుమారు 10 సంవత్సరాలు నెల్లూరు, కృష్ణా జిల్లాలో ప్రచారక్ పనిచేసిన తరువాత 1965లో విజయవాడ విభాగ్ ప్రచారక్ గా నియమితులై 1972 వరకు పనిచేశారు. ఆరోజుల్లో విజయవాడ విభాగం లో పశ్చిమగోదావరి, కృష్ణా , ఉమ్మడి గుంటూరు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాలు ఉండేవి (తరువాత కాలంలో గుంటూరు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కలిసి తొలుత ఒంగోలు జిల్లాగా అనంతరం ప్రకాశం జిల్లాగా ఏర్పడింది).

విజయవాడ విభాగ్ ప్రచారక్ గా భాద్యతలు స్వీకరించిన తర్వాత సంఘ్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. విభాగ్ లో ఉన్న కొన్ని పట్టణాలు, పేరున్న గ్రామాల్లో మాత్రమే జరుగుతున్న సంఘ్ శాఖలను మారుమూల ప్రాంతాల్లో సైతం శాఖలను ఏర్పాటు చేశారు. కేవలం సంఘ్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో సంఘ్ తరుపున క్రియాశీలకంగా వ్యవహరించేవారు. 

దుర్గాప్రసాద్ గారు మంచి వక్త , సంఘ్ శిక్షణా తరగతులలో ఆయన  ప్రసంగాలను సంఘ్ పెద్దల నుండి స్వయం సేవకుల వరకు ఏంతో శ్రద్ధగా ఆసక్తి గా వినేవారు. 

1972లో జరిగిన జై ఆంధ్రా ఉద్యమంలో సంఘ్ తరుపున కీలకపాత్ర పోషించారు. ఉద్యమం జరుగుతున్న సమయంలోనే పోలీసుల కాల్పుల్లో గాయపడి మరుసటి రోజు హాస్పిటల్ లో మరణించారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన పర్రచివర గ్రామంలో జరిగాయి. తమ అభిమాన నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన అంతిక్రియలకు వేలాది మంది స్వయం సేవకులు స్వచ్ఛందంగా తరలివచ్చి నివాళులర్పించారు. 

దుర్గాప్రసాద్ గారి గురించి , వారి వ్యక్తిత్వాన్ని గురించి ఎంత చెప్పిన తక్కువే పొగడ్తలతో పాటుగా విమర్శలను సమానంగా తీసుకున్న నిగర్వి . సంఘ్ ను విస్తరణ చేస్తున్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంటి బిగువున భరించి అనుకున్న కార్యాన్ని అనుకున్న సమయానికే పూర్తి చేసిన కార్యశీలి . 

దుర్గాప్రసాద్ గారు స్నేహశీలి , చిన్న పెద్ద అని తేడాలు లేకుండా అందరితో కలిసి పోయేవారు , స్వయం సేవకులు తమ జీవితాన్ని సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన తో చెప్పుకోవడమే కాకుండా సలహాలు, సూచనలు తీసుకునేవారు. 

దుర్గాప్రసాద్ గారు విద్యకు ఏంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు, శాఖలకు వచ్చే ప్రతి స్వయం సేవకులను వారి విద్యార్హతలు గురించి తెలుసుకొనేవారు. ఎందరో నిరుపేద స్వయం సేవకులకు ఉన్నత విద్య ను అభ్యసించేందుకు ఆర్థిక సహకారాన్ని అందించారు.

దుర్గాప్రసాద్ గారు నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఎందరో యువ స్వయం సేవకులను నాయకులుగా తీర్చిదిద్దారు. ఆయన తీర్చిదిద్దిన నాటి యువ స్వయం సేవకులు తమ తమ రంగాల్లో కీలకమైన స్థానాల్లో ఉన్నారు, మరి కొందరు ఆయన స్పూర్తితో సంఘ్ లో పనిచేసేందుకు అంకితం అయ్యారు.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి దుర్గాప్రసాద్ గారితో మంచి అనుబంధం ఉండేది.  నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న సమయంలోనే వి.ఆర్ హై స్కూల్లో చదువుతున్న వెంకయ్య నాయుడు గారు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్.ఎస్.ఎస్ కార్యక్రమాలకు ఆకర్షితుడై ఆర్.ఎస్.ఎస్ లో చేరారు. అనతి కాలంలోనే వెంకయ్య నాయుడు గారి ప్రతిభను గుర్తించడమే కాకుండా ఆదరించి ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. అంతే కాకుండా ఆయనలోని నాయకత్వ లక్షణాలను వెలికి తీసి నాయకుడిగా ఏదగడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆయన ఊహించిన విధంగానే తరువాత కాలంలో వెంకయ్య నాయుడు గారు దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా ప్రస్తుతం దేశానికి ఉపరాష్ట్రపతి గా ఎన్నికయ్యి తెలుగు వారి ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించారు. 

దుర్గాప్రసాద్ గారి వాత్సల్య కరుణా కటాక్షాలతో ఎదిగిన అనేకమంది స్వయం సేవకులు నేడు ఉన్నత స్థానాలకు ఎదిగి ఆయన పేరు మీద "భోగాది దుర్గాప్రసాద్ స్మారక సమితి" ని ప్రారంభించి గత మూడు దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

ఆంధ్ర ప్రాంతంలో సంఘ కార్య విస్తరణకు అహర్నిశలు శ్రమించి వందలాది మంది సంఘ్ కార్యకర్తలను తయారు చేసిన దుర్గాప్రసాద్ గారు ఇప్పటికి సంఘ స్వయం సేవకులకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు.


గొట్టిపాటి హనుమంతరావు (1944-1997)

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయవేత్తగా పేరు గడించిన మాజీ మంత్రి వర్యులు, స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు గారు స్...