Friday, December 10, 2021

భోగాది దుర్గాప్రసాద్ (1935-1972)

bhogadi durga prasad

భోగాది దుర్గాప్రసాద్ తెలుగు నాట "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" (ఆర్.ఎస్.ఎస్) లో పనిచేసిన పాత తరానికి ఈ పేరు బాగా సూపరిచితం. తూర్పు&పశ్చిమ గోదావరి, కృష్ణ , ఉమ్మడి గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలో ఈ పేరు వినని స్వయం సేవకులు ఉండరు. మరింత క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి గురువు గారు.

భోగాది దుర్గాప్రసాద్ గారు 1935జూన్ 15వ తేదీన కృష్ణా జిల్లాలోని నాగాయలంక తాలూకా పర్రచివర గ్రామంలో ఉన్న సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు భోగాది సుబ్బారావు, మణిక్యమ్మ గార్లు. సోదరులు రామ్మోహన్ రావు , వెంకట సాయి, నారాయణ మూర్తి, సోదరి తులసీ రత్నం. వీరి మేనమామ రాజకీయ ఉద్దండులు, దివిసీమ గాంధీ గా ప్రసిద్ధి గాంచిన మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు గారు. 

దుర్గాప్రసాద్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామమైన పర్రచివర, నాగాయలంక లో , ఇంటర్మీడియట్ మరియు బి.ఏ డిగ్రీ లను బందరు(ప్రస్తుతం మచిలీపట్నం) లోని జాతీయ కళాశాలలో పూర్తి చేశారు. 

దుర్గాప్రసాద్ చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత తో కూడిన దైవ చింతన ఎక్కువగా ఉండేవి, ఈ కారణంగానే చిన్నతనంలోనే ఆర్.ఎస్.ఎస్ తో అనుబంధం ఏర్పడి జీవిత చరమాంకం వరకు కొనసాగింది. కళాశాలలో చదువుతున్న సమయంలోనే ఆర్.ఎస్.ఎస్ లో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయడానికి సంకల్పించిన వీరు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే సంఘ్ ఆదేశాల మేరకు 1955లో నెల్లూరు జిల్లాలో సంఘ్ ప్రచారక్ గా భాద్యతలు స్వీకరించారు. 

అప్పటికే నెల్లూరు జిల్లా ప్రచారక్ గా పనిచేసి రాయలసీమ ప్రాంత ప్రచారక్ గా భాద్యతలు స్వీకరించిన సోమేపల్లి సోమయ్య గారి సహకారంతో నెల్లూరు నగరం మరియు వాటి పరిసర ప్రాంతాలలో వరకే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంఘ్ ను జిల్లా వ్యాప్తంగా విస్తరించి అనేక నూతన శాఖలు ఏర్పర్చడంలో దుర్గాప్రసాద్ గారి కృషి మారువలేనిది. సుమారు 10 సంవత్సరాలు నెల్లూరు, కృష్ణా జిల్లాలో ప్రచారక్ పనిచేసిన తరువాత 1965లో విజయవాడ విభాగ్ ప్రచారక్ గా నియమితులై 1972 వరకు పనిచేశారు. ఆరోజుల్లో విజయవాడ విభాగం లో పశ్చిమగోదావరి, కృష్ణా , ఉమ్మడి గుంటూరు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాలు ఉండేవి (తరువాత కాలంలో గుంటూరు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కలిసి తొలుత ఒంగోలు జిల్లాగా అనంతరం ప్రకాశం జిల్లాగా ఏర్పడింది).

విజయవాడ విభాగ్ ప్రచారక్ గా భాద్యతలు స్వీకరించిన తర్వాత సంఘ్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. విభాగ్ లో ఉన్న కొన్ని పట్టణాలు, పేరున్న గ్రామాల్లో మాత్రమే జరుగుతున్న సంఘ్ శాఖలను మారుమూల ప్రాంతాల్లో సైతం శాఖలను ఏర్పాటు చేశారు. కేవలం సంఘ్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో సంఘ్ తరుపున క్రియాశీలకంగా వ్యవహరించేవారు. 

దుర్గాప్రసాద్ గారు మంచి వక్త , సంఘ్ శిక్షణా తరగతులలో ఆయన  ప్రసంగాలను సంఘ్ పెద్దల నుండి స్వయం సేవకుల వరకు ఏంతో శ్రద్ధగా ఆసక్తి గా వినేవారు. 

1972లో జరిగిన జై ఆంధ్రా ఉద్యమంలో సంఘ్ తరుపున కీలకపాత్ర పోషించారు. ఉద్యమం జరుగుతున్న సమయంలోనే పోలీసుల కాల్పుల్లో గాయపడి మరుసటి రోజు హాస్పిటల్ లో మరణించారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన పర్రచివర గ్రామంలో జరిగాయి. తమ అభిమాన నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన అంతిక్రియలకు వేలాది మంది స్వయం సేవకులు స్వచ్ఛందంగా తరలివచ్చి నివాళులర్పించారు. 

దుర్గాప్రసాద్ గారి గురించి , వారి వ్యక్తిత్వాన్ని గురించి ఎంత చెప్పిన తక్కువే పొగడ్తలతో పాటుగా విమర్శలను సమానంగా తీసుకున్న నిగర్వి . సంఘ్ ను విస్తరణ చేస్తున్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంటి బిగువున భరించి అనుకున్న కార్యాన్ని అనుకున్న సమయానికే పూర్తి చేసిన కార్యశీలి . 

దుర్గాప్రసాద్ గారు స్నేహశీలి , చిన్న పెద్ద అని తేడాలు లేకుండా అందరితో కలిసి పోయేవారు , స్వయం సేవకులు తమ జీవితాన్ని సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన తో చెప్పుకోవడమే కాకుండా సలహాలు, సూచనలు తీసుకునేవారు. 

దుర్గాప్రసాద్ గారు విద్యకు ఏంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు, శాఖలకు వచ్చే ప్రతి స్వయం సేవకులను వారి విద్యార్హతలు గురించి తెలుసుకొనేవారు. ఎందరో నిరుపేద స్వయం సేవకులకు ఉన్నత విద్య ను అభ్యసించేందుకు ఆర్థిక సహకారాన్ని అందించారు.

దుర్గాప్రసాద్ గారు నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఎందరో యువ స్వయం సేవకులను నాయకులుగా తీర్చిదిద్దారు. ఆయన తీర్చిదిద్దిన నాటి యువ స్వయం సేవకులు తమ తమ రంగాల్లో కీలకమైన స్థానాల్లో ఉన్నారు, మరి కొందరు ఆయన స్పూర్తితో సంఘ్ లో పనిచేసేందుకు అంకితం అయ్యారు.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి దుర్గాప్రసాద్ గారితో మంచి అనుబంధం ఉండేది.  నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న సమయంలోనే వి.ఆర్ హై స్కూల్లో చదువుతున్న వెంకయ్య నాయుడు గారు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్.ఎస్.ఎస్ కార్యక్రమాలకు ఆకర్షితుడై ఆర్.ఎస్.ఎస్ లో చేరారు. అనతి కాలంలోనే వెంకయ్య నాయుడు గారి ప్రతిభను గుర్తించడమే కాకుండా ఆదరించి ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. అంతే కాకుండా ఆయనలోని నాయకత్వ లక్షణాలను వెలికి తీసి నాయకుడిగా ఏదగడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆయన ఊహించిన విధంగానే తరువాత కాలంలో వెంకయ్య నాయుడు గారు దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా ప్రస్తుతం దేశానికి ఉపరాష్ట్రపతి గా ఎన్నికయ్యి తెలుగు వారి ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించారు. 

దుర్గాప్రసాద్ గారి వాత్సల్య కరుణా కటాక్షాలతో ఎదిగిన అనేకమంది స్వయం సేవకులు నేడు ఉన్నత స్థానాలకు ఎదిగి ఆయన పేరు మీద "భోగాది దుర్గాప్రసాద్ స్మారక సమితి" ని ప్రారంభించి గత మూడు దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

ఆంధ్ర ప్రాంతంలో సంఘ కార్య విస్తరణకు అహర్నిశలు శ్రమించి వందలాది మంది సంఘ్ కార్యకర్తలను తయారు చేసిన దుర్గాప్రసాద్ గారు ఇప్పటికి సంఘ స్వయం సేవకులకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు.


No comments:

Post a Comment